8 June 2015

కొలువుల తొలకరి!

కొలువుల తొలకరి!
* ఇక నెలనెలా ప్రకటనల జారీ 
* సత్వరమే 25 వేల క్షేత్రస్థాయి ఉద్యోగాల భర్తీ 
* కంప్యూటర్ పట్టభద్రుల కోసం కొత్త కొలువులు 
* తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ ఆదేశాలు 
, హైదరాబాద్‌: రాష్ట్రంలో జులై నుంచి నెలానెలా ఉద్యోగ నియామకాల ప్రకటనలు (నోటిఫికేషన్లు) వెలువడుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా మొదటి విడతలో 25 వేల క్షేత్రస్థాయి పోస్టులను భర్తీ చేస్తామని, ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి నియామకాలు చేపడతామని చెప్పారు. సంప్రదాయిక పోస్టులు గాకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా శాఖలకు అన్ని విధాలా ఉపయోగపడే ఉద్యోగాలను సృష్టించి భర్తీ చేస్తామని వెల్లడించారు. జూన్ 8న ఉద్యోగ నియామకాలపై ఆయన అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శులు జిల్లా, జోనల్‌ స్థాయిలకు చెందిన 19,500 ఖాళీ పోస్టుల వివరాలను అందించారు. మిగిలిన పోస్టుల వివరాలను జూన్ 9లోపు సమర్పించాలని, అన్నింటినీ సుపరిపాలన (సీజీజీ) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
సంప్రదాయాలు మారాలి...: 
బ్రిటీష్‌, తమిళనాడు విధానాలకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలను కొనసాగించారని, టైపిస్టులు, స్టెనోలు, జూనియర్‌ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులకు దాదాపు ఒకే తరహా విధులున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. ఇకపై అలా గాకుండా శాఖల వాస్తవ అవసరాలు ఏమిటి? ఏ తరహా ఉద్యోగులు కావాలనే అంశంపై చర్చించి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సీఎస్‌ ఆదేశించారు. అవసరంలేని పోస్టులను పరిహరించాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లు, ఐటీ వంటి సాంకేతిక సేవల వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా కంప్యూటర్‌ పట్టభద్రుల కోసం కొత్త పోస్టులు సృష్టించి, నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. అన్ని పోస్టులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరని, పట్టభద్రులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. సర్వీసునిబంధనల్లో మార్పులు తెస్తామన్నారు.
దఫాల వారీగా భర్తీ: 
రాష్ట్రంలో మొత్తం ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తే పదోన్నతుల సమయంలో ఇబ్బందులెదురవుతాయని, అంతా ఒకేసారి పదవీ విరమణ పొందే అవకాశం ఉందని సీఎస్‌ రాజీవ్‌శర్మ తెలిపారు. ఈ సమస్యల కారణంగానే సీఎం దఫాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారన్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అందరికీ పదోన్నతులు, ఇతర అవకాశాలు దక్కాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. దీనికి అనుగుణంగా నెలనెలా ఉద్యోగ నియామకాలను చేపడతామని తెలిపారు. నియామకాల కాలమాని(కేలండర్‌)ని ముందుగానే విడుదల చేస్తామన్నారు.
వయోపరిమితి పెంపుపై...: 
జోనల్‌ వ్యవస్థపై అధ్యయనం జరుగుతోందని, త్వరలోనే ముఖ్యమంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని సీఎం నిర్ణయించారని, దీనిపైనా బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో అనుమతి తీసుకొనే వీలుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ముఖ్యకార్యదర్శులు స్వాగతించారు. జోనల్‌ విధానం, వయోపరిమితి పెంపు, తదితర అంశాలపై సూచనలు అందజేశారు.
ఆ ఆరు శాఖల్లో అధిక ఖాళీలు: 
ముఖ్యకార్యదర్శులు సమర్పించిన 19 వేల పోస్టుల్లో అధిక భాగం విద్య, వైద్యం, పురపాలక, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పోలీసు శాఖలకు చెందినవే ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. పోస్టులు, వాటి ప్రాధామ్యాలు, ఉద్యోగుల వేతనాలు, అర్హతలు, ఆయా పోస్టుల ఉద్దేశాలను సీజీజీ వెబ్‌సైట్‌లో చేర్చాలని సూచించారు.
స్వీపర్‌ పోస్టులు వద్దు: 
స్వీపర్‌ పోస్టుల నియామకాలను ఇకపై చేపట్టవద్దని, పొరుగుసేవలు, తాత్కాలిక ఉద్యోగులతో ఈ పనులు చేయించాలని సీఎస్‌ ఆదేశించారు.

No comments:

Post a Comment