ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ


* జిల్లా, మండల, పురపాలక స్థాయి శిబిరాలు 
* మేధావులు, నిపుణులతో తరగతులు 
* ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారుల పాఠాలు
* తెలంగాణ సర్కారు సన్నాహాలు 


ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో భారీఎత్తున చేపట్టిన ఉద్యోగ నియామకాలకు యువతను సన్నద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించనుంది. ఉద్యోగాలు, వాటి కేటగిరీలు, పరీక్షల విధానం, పాఠ్య ప్రణాళికలపై మేధావులు, నిపుణులతో తరగతులను చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా 15,222 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులిచ్చింది. మరో పదిరోజుల్లో ఇంకో పదివేల ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు జారీకానున్నాయి. ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా విభజించింది. వీటిని పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా, రాష్ట్రస్థాయి నియామక సంస్థల ద్వారా, మిగిలినవాటిని ప్రభుత్వరంగ సంస్థల్లోని ఎంపిక కమిటీల ద్వారా భర్తీ చేయనుంది. తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం వంటి అంశాలతో కూడిన కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన, కొత్త మార్కుల పద్ధతి.. వీటన్నింటిపైనా యువతలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వపరంగా బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.
యువత కోసం.... ఉద్యోగార్థులు ప్రస్తుతం పోటీపరీక్షల కోసం స్టడీ సర్కిళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వరంగంలో ఇవి చాలా తక్కువగా ఉండగా ప్రైవేటుసంస్థల ఆధ్వర్యంలో భారీగా నడుస్తున్నాయి. వీటిలో రుసుములు రూ.వేలల్లో ఉన్నాయి. పేద, మధ్యతరగతి యువత ఈ రుసుములు భరించే పరిస్థితి లేదు. వీటన్నింటిని సీఎం గమనించి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం కార్యాచరణ ఖరారుకు సంక్షేమ శాఖలను ఆదేశించారు.
ఏం చేస్తారు..? * జిల్లా, మండల కేంద్రాల్లో ఉద్యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేస్తారు. ఉన్నతాధికారికి సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు పర్యవేక్షిస్తారు. పురపాలక స్థాయిలో కమిషనర్లది బాధ్యత. సంక్షేమ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో తరగతులు జరుగుతాయి. మండలస్థాయిలో, జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిపుణులను ఎంపికచేస్తారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారికి అవకాశం ఇస్తారు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యులు ఈ కేంద్రాలను సందర్శించి, యువతకు అవగాహన కల్పిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వీటిని సందర్శించి పాఠాలు చెబుతారు.
దేహదారుఢ్యంలోనూ.. 


పోలీసు, ఆబ్కారి, జైళ్ల, అగ్నిమాపక శాఖలలో కానిస్టేబుళ్లు, ఎస్సై పరీక్షలు రాసే అభ్యర్థులకు సైతం విడిగా దేహదారుఢ్యం, పరుగు పోటీలపై శిక్షణ ఇస్తారు. జిల్లా యంత్రాంగం, పోలీసు, ఎక్సైజ్‌, ఆబ్కారి శాఖల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. తెలంగాణలో యువతకు పోటీపరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకు ఉద్యోగ, గెజిటెడ్‌, గ్రూపు-1 అధికారుల సంఘాలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి సహకారమూ తీసుకుంటారు.
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment