21 May 2015

తెలంగాణ పోలీసుశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ

* దాదాపు 7వేల ఖాళీల భర్తీ
* రెండు నెలల్లో ప్రకటన జారీకి అవకాశం
* 5 కి.మీ.పరుగు, దేహదారుఢ్య పరీక్షల విషయంలో సడలింపు!

 తెలంగాణ పోలీసుశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. రాబోయే రెండు నెలల్లో నియామక ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నియామకాలకు సంబంధించిన నిబంధనలనూ మార్చనున్నారు. ముఖ్యంగా విమర్శలకు కారణమైన 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని ఎత్తివేయబోతున్నారు. దాంతోపాటు మిగతా దేహదారుఢ్య పరీక్షల విషయంలోనూ సడలింపులు ఇచ్చే అవకాశముంది. వీటికి సంబంధించిన తుదికసరత్తు పూర్తికావచ్చింది. దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపి భర్తీకి నియామక ప్రకటన విడుదల చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2012లో ఎస్సై అభ్యర్థుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. కొని కారణాల వల్ల రెండేళ్ల తర్వాత ఫలితాలు వెలువడగా..అభ్యర్థులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఈశిక్షణ వచ్చే ఆగస్టుతో పూర్తికానుంది. అనంతరం పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీకి మళ్లీ ఎలాంటి ప్రకటనా రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసుశాఖకు అదనపు పోస్టులు మంజూరు చేసింది. ముఖ్యంగా 3,150 డ్రైవర్‌ పోస్టులు మంజూరు చేసింది. దీంతోపాటు 2008 ప్రభుత్వం మంజూరు చేసిన 35వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి చివరిదశ నియామకాలు జరగాల్సి ఉంది. ఇవి దాదాపు ఏడువేల వరకూ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్‌ (హోంగార్డు), కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు. ప్రభుత్వం అనుమతి తీసుకున్నదే తడవుగా నియామక ప్రకటన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన నియామక ప్రక్రియలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇందులో ప్రధానమైంది 5 కిలోమీటర్ల పరుగుపందెం. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం ఉమ్మడిరాష్ట్రంలోనే ఈస్థాయిలో పరుగుపందెం ఉంది. ఇంతదూరం పరుగెత్తలేక పలువురు మరణించినసందర్భాలున్నాయి. అసలు దేహదారుఢ్య పరీక్షల కంటే ముందుగా రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని.. దాంతోపాటు 5 కి.మీ.కు బదులు 3 కిలోమీటర్ల పరుగుపోటీయే పెట్టాలనీ ప్రతిపాదించారు. హైజంప్‌, లాంగ్‌ జంప్‌ విషయంలోనూ సడలింపుఇవ్వాలనుకుంటున్నారు. వీటిలో ఉత్తీర్ణులైనవారికి చివరగా మెయిన్స్‌ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులకు ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలిస్తారు. ఈమార్పుల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం అనంతరం నియామకప్రకటన జారీచేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జులైలో భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారు.

No comments:

Post a Comment