23 May 2015

ఉద్యోగార్థులకు తాజా తీపి కబురు- 2000 పీఓ ఖాళీలతో

ఆందోళన అవసరం లేదు
ఉద్యోగార్థులకు తాజా తీపి కబురు- 2000 పీఓ ఖాళీలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియామక ప్రకటన! రాతపరీక్షలో ప్రాథమిక (ప్రిలిమినరీ), ప్రధాన (మెయిన్‌) పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆహ్వానిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిపుణుల మార్గదర్శకత్వం... ఇదిగో!
పరీక్షా విధానంలో ఏ మార్పు జరిగినా అభ్యర్థుల్లో ఆందోళన సహజం. అయితే ఎస్‌బీఐ పీఓ పరీక్షను పరీక్షిస్తే మొత్తం మీద సబ్జెక్టుల్లో, స్థాయిలో ఎటువంటి మార్పూ లేదు. ప్రస్తుత పరీక్షలో రెండో అంచెలో ఉన్న ప్రధాన పరీక్ష, గతంలో ఉన్న రాత పరీక్ష మాదిరిగానే అవే సబ్జెక్టులతో ఉంది. ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) మాత్రమే అదనంగా ఉంది. అందులోని సబ్జెక్టులు కూడా ప్రధాన పరీక్షలోని సబ్జెక్టులే. వాటిలోని ప్రశ్నల స్థాయి, బ్యాంకు క్లరికల్‌ పరీక్ష స్థాయిలో ఉంటాయి. కాబట్టి పరీక్ష గురించిన ఆందోళన అనవసరం.
ముందుగా ప్రాథమిక పరీక్షకు సన్నద్ధమై అందులో ఉత్తీర్ణత సాధించాక ప్రధాన పరీక్షకు సిద్ధమవాలనే ఆలోచనతో కొందరు ఉంటారు. ప్రధాన పరీక్షలో ఉండే సబ్జెక్టులే ప్రాథమిక పరీక్షలో ఉండడం, వాటి స్థాయి కూడా తక్కువగా ఉండడం వల్ల అభ్యర్థులు ప్రధాన పరీక్ష కోసం ఇప్పటినుంచీ సిద్ధమవాలి. దీని వల్ల ప్రత్యేకంగా ప్రాథమిక పరీక్ష కోసం సిద్ధమవాల్సిన అవసరముండదు. అదేవిధంగా ప్రాథమిక పరీక్ష తర్వాత ప్రధాన పరీక్షకు ఎక్కువ సమయం ఉండదు. అందువల్ల ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే సిద్ధమవాలి.
ప్రధాన పరీక్షలో నాలుగు విభాగాలు, ఆరు సబ్జెక్టులు ఉన్నాయి. డేటా అనాలసిస్‌ & ఇంటర్‌ప్రిటేషన్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలతోపాటు నాలుగో విభాగంలో జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ సబ్జెక్టులు ఉన్నాయి.
* డేటా అనాలసిస్‌ & ఇంటర్‌ప్రిటేషన్‌: గ్రాఫ్‌లు, పట్టికలు, చార్టుల ద్వారా సమాచారం ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. 50 ప్రశ్నల్లో సాధారణంగా 45 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి, 5 ప్రశ్నలు పర్‌మ్యూటేషన్స్‌ & కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీస్‌ నుంచి ఉంటాయి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు సాధించడానికి శాతాలు, సరాసరి, నిష్పత్తి, వడ్డీ, లాభనష్టాలు మొదలైన అరిథ్‌మెటిక్‌ అంశాలు చాలా అవసరం. అందువల్ల వీటిని బాగా నేర్చుకుని సాధన చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లోని కొన్ని ప్రశ్నలను సాధించాల్సిన అవసరం లేకుండా గ్రాఫ్‌ను గమనిస్తూ జవాబులను గుర్తించవచ్చు. అయితే సాధన అవసరం.
* రీజనింగ్‌: ప్రధాన పరీక్షలోని ఈ విభాగం హెచ్చుస్థాయిలో ఉంటుంది. ఎక్కువ ప్రశ్నలు ఎనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి ఉంటాయి. చాలావరకు ప్రశ్నల్లో కింద ఇచ్చిన జవాబులన్నీ సరైనవేనని భ్రమింపజేసేలా ఉంటాయి. కాబట్టి కచ్చితమైన జవాబులు గుర్తించగలిగేలా సాధన అవసరం.
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: రాతపరీక్షలోని ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు రెండింటిలోనూ ఈ విభాగముంది. పరీక్షకు సంబంధించిన మొత్తం 250 మార్కుల్లో 100 మార్కులు దీనికే ఉన్నాయి. ఏదైనా విషయాన్ని తీసుకుని దానిపై 150- 200 పదాల వరకు ఇంగ్లిష్‌లో ఎస్సే రాయడం సాధన చేయాలి. అదేవిధంగా విస్తృతంగా ఇచ్చిన ఏదైనా విషయాన్ని కుదించి రాయడం నేర్చుకుంటే ప్రెసీ రైటింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది.
* జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌ & కంప్యూటర్స్‌:ఎకానమీ, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలకు ప్రాధాన్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా సమాచారాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. అలాగే బ్యాంకింగ్‌ పరిభాషను బాగా చూసుకోవాలి. ఆర్‌బీఐ గురించి బాగా తెలుసుకోవాలి.
కంప్యూటర్స్‌కు సంబంధించి సాధారణంగా బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, నెట్వర్కింగ్‌, ఇంటర్నెట్‌ మొదలైన వాటితోపాటు కంప్యూటర్స్‌ రంగానికి సంబంధించిన తాజా సమాచారాలపై ప్రశ్నలుంటాయి. దాదాపు అభ్యర్థులందరూ దీనిలో మంచి మార్కులు సంపాదించవచ్చు. మార్కెటింగ్‌కు సంబంధించి మార్కెటింగ్‌, సేల్స్‌, అడ్వర్త్టెజ్‌మెంట్‌, కన్స్యూమర్‌ బిహేవియర్‌, మార్కెటింగ్‌ మిక్స్‌, ప్రాడక్ట్‌ లైఫ్‌ సైకిల్‌ మొదలైనవాటి నుంచి ప్రశ్నలు వస్తాయి.
వీటన్నింటిపై దృష్టి కేంద్రీకరిస్తూ వార్తాపత్రికలను చదువుతూ గత 5,6 మాసాల తాజా పరిణామాలను చూసుకుంటే ఎక్కువ మార్కులను సంపాదించగలిగే విభాగమిది.
ఈ విభాగాలన్నింటికీ సరైన ప్రాముఖ్యమిస్తూ తగిన ప్రణాళికతో సన్నద్ధవటం ముఖ్యం!

No comments:

Post a Comment