త్వరలో 24 జిల్లాల తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక కసరత్తు చేశారు.. ఈ సందర్భంగా జిల్లాల్లో వినిపిస్తున్న డిమాండ్లపై చర్చించారు. తెలంగాణ జనాభా రమారమి నాలుగున్నర కోట్లు అంటే పది జిల్లాల సగటు జనాభా దాదాపు 45 లక్షలు. దాంతో సుమారు 20 నుంచి 25 లక్షల జనాభా ఉండేటట్లు జిల్లాలను విభజించే ఆలోచనలో ఉంది కేసీఆర్ సర్కారు ఎన్నికల మానిఫెస్టోలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడా దిశగా ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. సంబంధిత అధికారులతో సమావేశమై పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఎలా ఉండాలో చర్చించారు ఈ సందర్భంగా ఇప్పటికే వినిపిస్తున్న కొత్త జిల్లాల డిమాండ్ల ప్రస్తావన వచ్చిందంటున్నారు.
కొత్తగా 14 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉన్నాయి. రామగుండం, మంచిర్యాల, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, ఛార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ ఈస్ట్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల ఏర్పాటుతో పాటు భూపాలపల్లి ప్రాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ పేరిట జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఎన్ని జిల్లాలు ఏర్పాటుకు అవకాశముందో అధ్యయనం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారంటున్నారు.
రానున్న కాలంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం వాటిని దశల వారీగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. తొలి విడతలో ఎలాంటి రాజకీయ వివాదాలు లేని జిల్లాలను ఏర్పాటు చేసి. మిగిలిన వాటిపై తర్వాత కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నియోజకవర్గాల పునర్-వ్యవస్థీకరణతో ముడిపడి ఉంటుందంటున్నారు.


0 comments:
Post a Comment