| త్వరలో డిజిటల్ డిగ్రీలు! | |
* జాతీయ విద్యానిధి ఏర్పాటు * విద్యను భారతీయం చేయాలి * వీఐటీ స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు వేలూరు: నకిలీ పట్టాలకు ముకుతాడు వేస్తూ ఆన్‌లైన్‌లోనే డిగ్రీల వెరిఫికేషన్ నిర్వహించేలా త్వరలో డిజిటల్ డిగ్రీలు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే 'జాతీయ విద్యానిధి' (నేషనల్ అకడమిక్ డిపాజిటరీ)ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబరు 6న తమిళనాడు వేలూరులోని 'వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)' విశ్వవిద్యాలయం 29వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి చరిత్రను చదవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తే మేలని అభిప్రాయపడ్డారు. మన విద్యను కూడా భారతీయం చేయాలన్నారు. దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజినీర్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని.. వీరిలో కేవలం 15 శాతం మందే ఉద్యోగావకాశాలు పొందుతున్నారని నాస్‌కామ్ వెల్లడించిన నివేదికలు ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్య, పరిశ్రమలను అనుసంధానించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ దిశగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళుతున్న మేధావులంతా తిరిగి భారత్‌కు రావాలని వెంకయ్య కోరారు. యూఎన్ఐడీవో నివేదిక ప్రకారం ఏటా లక్ష మంది భారతీయ మేధావులు విదేశాలకు వెళుతున్నారనీ, దాని విలువ రెండు బిలియన్ అమెరికన్ డాలర్లని పేర్కొన్నారు. ప్రతి ముగ్గురు ఐఐటీ పట్టభద్రుల్లో ఒకరు విదేశాలకు వెళ్తున్నారన్నారు. 'విదేశాలకు వెళ్లండి, సంపాదించండి, కానీ భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టి, ఇక్కడ సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి' అని వెంకయ్యనాయుడు కోరారు. పేపాల్ సంస్థ జనరల్ మేనేజర్ అనుపమ్ పహుజ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడన్నారు. ప్రతి అంశాన్ని సంక్లిష్టం చేసుకోకుండా వైవిధ్యంగా ఆలోచించాలన్నారు. వీఐటీ ఛాన్స్‌లర్ జి.విశ్వనాథన్, ఉపకులపతి వి.రాజుకార్యక్రమంలో పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో 134 మందికి పీహెచ్‌డీలూ, 3440 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. | |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment