3 August 2015

వయోపరిమితి సడలింపు!





వయోపరిమితి సడలింపు!
* పోలీసు ఉద్యోగాల్లో దళిత, గిరిజనులకు వెసులుబాటు 
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచన 
* ప్రతిపాదనలతో దస్త్రం 
* పోలీసు శాఖ అభ్యంతరాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలీసు, ఇతర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాల్లో గిరిజనులు, దళిత అభ్యర్థులకు కొన్ని అర్హత అంశాల్లో సడలింపులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ,ఎస్టీలకు వయోపరిమితి సడలింపు, గిరిజనులకు ఎత్తు కొలతలో కొంత తగ్గింపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పోలీసు శాఖ మాత్రం సడలింపులు చేయరాదని సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిలో పదేళ్ల సడలింపు ఇచ్చింది. పోలీసు, ఎక్సైజ్‌, జైలు, అగ్రిమాపకం వంటి యూనిఫామ్‌ సర్వీసుల వారికి మాత్రం సడలింపు ప్రకటించలేదు. దళిత, గిరిజన అభ్యర్థులకైనా సడలింపు ఇవ్వాలని పలువురు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌ను కలిసి అభ్యర్థించారు. మరోవైపు పోలీసు ఉద్యోగాలకు నిర్దిష్ట ఎత్తు నిబంధనలున్నాయి. ఈ ప్రమాణాల మేరకు లేనందువల్ల చాలా మంది ఎంపిక కావడం లేదు. గిరిజనులు జన్యుపరంగా ఎత్తు తక్కువగా ఉంటారని, తెలంగాణలో చేపడుతున్న తొలి నియామకాల సందర్భంగా ప్రస్తుతం ఉన్న ఎత్తు ప్రమాణాలలో కొంత తగ్గింపు ఇవ్వాలని గిరిజన శాసనసభ్యులు, మండలి సభ్యులు సీఎంను కలిసి అభ్యర్థించారు. వీటన్నింటిపై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించగా వారు వాటిని సిద్ధం చేశారు.
పోలీసు శాఖ నుంచి వ్యతిరేకత 
ఈ ప్రతిపాదనలపై పోలీసుశాఖ నుంచి సీఎం కార్యాలయం అభిప్రాయాన్ని కోరింది. పోలీసు ఉద్యోగాలు కీలకమైనవని, నిర్ణీత ప్రమాణాలు ఉంటేనే వారు సరైన విధులు నిర్వర్తిస్తారని, సడలింపులు ఇవ్వడం తగదని ఆ శాఖ నివేదించినట్లు తెలిసింది. అందరి అభిప్రాయాలను పరిశీలించి సీఎం కేసీఆర్‌ త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

No comments:

Post a Comment