నియామకాలకు వయోపరిమితి పదేళ్ల సడలింపు | |
* సభ్యులు సరేనంటే సర్కారుకు సమ్మతమే
* ఉద్యోగాల కోసమైతే ఉపాధ్యాయ డీఎస్‌సీ ఉండదు సభ్యులంతా సరేనంటే ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల ప్రస్తుత వయోపరిమితికి పదేళ్ల సడలింపు ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే రానున్న రెండేళ్ల వ్యవధిలో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వీటికి సంబంధించిన ప్రకటనల జారీ త్వరలోనే మొదలవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపును ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, సభ్యులంతా అంగీకరిస్తే పదేళ్లు సడలింపును ఇచ్చేందుకు ప్రభుత్వానికి సమ్మతమేనని ఆయన పేర్కొన్నారు. శాసన మండలిలో శనివారం కాంగ్రెస్ పక్ష నేత డి.శ్రీనివాస్ లేవనెత్తిన కొన్ని అంశాలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అదనపు నిధుల కోసం దిల్లీకి వెళ్లటం, సాగునీటి ప్రాజెక్టులపై పునఃసమీక్ష, బీసీలకు అదనపు నిధులు వంటి అంశాలపై అన్ని పార్టీలు కలిసి కూర్చుని తుది నిర్ణయాన్ని తీసుకొందామని ఆయన చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఉంచడం కోసమే డీఎస్‌సీలను నిర్వహిస్తారే తప్ప ఉద్యోగాల కోసం ఏ పిచ్చి ప్రభుత్వం కూడా డీఎస్‌సీలను నిర్వహించదని ఆయన వ్యాఖ్యానించారు. ఉర్దూ ఉపాధ్యాయులను, లెక్చరర్లను మాత్రం నియమించాల్సి ఉందన్నారు. ''సీఎంలు అంతా సభ్యులుగా నీతి అయోగ్ ఉన్నందున మునుపటి ప్రణాళిక సంఘం మాదిరిగా కాకుండా.. ఇప్పుడు రాష్ట్రాలు చెప్పినట్టుగా నీతి అయోగ్ వ్యవహరిస్తుంది. ఇటీవల మార్పుల వల్ల కేంద్ర పన్నుల్లో మనకు రూ.3వేల కోట్ల మేర పెరిగాయి. కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి నిధులను కోరవచ్చో చర్చించేందుకు అధికారులు, సభ్యులతో రెండు, మూడు రోజుల్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తాను. అక్కడి విషయాలను బట్టి ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. అవసరమైతే నా నేతృత్వంలోనే అఖిలపక్షం దిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం. సర్పంచుల సంఖ్య బాగా తక్కువ కావటాన ఒక్క కేరళలో మాత్రమే నెలకు రూ.6,600 వేతనం ఇస్తున్నారు. ఇక్కడ రూ.5వేలకు పెంచాం. హైకోర్టు విభజన లేకుండా రాష్ట్ర విభజన పరిపూర్ణం కానట్టే. హైకోర్టు విభజనకు కొన్ని శక్తులు అడ్డుపడుతున్న మాట వాస్తవం. అయినా 15 రోజుల్లో రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటవుతుందని సమాచారం అందింది. నేనూ 3 రోజుల్లో దిల్లీకి వెళ్తాను. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు నెల రోజులు తప్ప ఇక ఎంతమాత్రం విద్యుత్తు కోతలు ఉండవు. ఆ నెలలోనూ తప్పని సరైతేనే కోతలు ఉంటాయి. అదీ వ్యవసాయానికి కొతల్లేకుండా చూడాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. మే నుంచి అసలు కోతలు ఉండబోవు. 2016 నుంచి వ్యవసాయానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గం.ల వరకు ఏకధాటిగా విద్యుత్తు ఇస్తాం. 2017 నుంచి రైతులతో సహా అందరికీ 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు. |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment