Singareni syllabus released By navatelanganaMedia 2015


సింగరేణిలో కొలువుల జాతర మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత 1178 ఖాళీలను భర్తీ చేసేందుకు సింగరేణి ప్రకటన విడుదల చేసింది. స్థానికత ఆధారంగా కొన్ని ఉద్యోగ నియామకాలను రిజర్వు చేయగా, మరి కొన్ని స్థానికేతరులకు కూడా ఈ ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు. సింగరేణిలో ప్రస్తుతం విడుదల చేసిన నియామక ప్రకటనలో 1178 ఖాళీల్లో, 811 ఖాళీలు కేవలం మైనింగ్‌ డిప్లొమా ఉద్యోగాలకే కావడం విశేషం. అర్హత గల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్‌లో తమ పూర్తి వివరాలను అప్‌లోడ్‌ చేసిన తర్వాత హార్డ్‌కాపీని మార్చి 4లోపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం. జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) రిక్రూట్‌మెంటు సెల్‌ విభాగానికి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను జత చేసి అందజేయాలి. భారీ స్థాయిలో ఖాళీల నియామకానికి ప్రకటన విడుదల చేసిన సింగరేణి ఉద్యోగార్థుల కోసం మార్గదర్శనం చేస్తూ 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనం..
* అండర్‌మేనేజర్‌
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (మైనింగ్‌)
ఖాళీలు: 100 (స్థానికత ఆధారంగా 60)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 సీనియారిటీ ఆధారంగా రూ.46500 పెరుగుతుంది.
విద్యార్హత: బీఈ, బీటెక్‌ (మైనింగ్‌) లేదా సమానమైన చదువు. 55 శాతం మార్కులు
విధులు: గని ప్రణాళిక. గనిలో పని విధానం. కింది స్థాయి ఉద్యోగులతో సక్రమంగా పనులు చేయించడం, గనిలో పని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దానికి అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. గనుల చట్టం ప్రకారం పనులు చేయిస్తుండాలి. గనుల పర్యవేక్షక విధి.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: వెంటిలేషన్‌, మిషనరీ, పని విధానం. ప్రథమ చికిత్స, గనుల చట్టం, గనుల సర్వేతో పాటు లెజిస్లేషన్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ అండ్‌ ఎం)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (ఇంజినీరింగ్‌, మెకానికల్‌)
ఖాళీలు: 67 (స్థానికత ఆధారంగా 41)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46500 వరకు
విద్యార్హత: బీఈ, బీటెక్‌, ఏఎంఐఈ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌) 55 శాతం మార్కులు
విధులు: ఏరియా వర్క్‌షాపుల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా పని చేయాలి. ఎలక్ట్రికల్‌ అయితే విద్యుత్తు సరఫరా. గనుల్లో మోటార్లకు అవసరమైన విద్యుత్తును సరఫరాకు పర్యవేక్షణ. కింది స్థాయి సాంకేతిక సిబ్బందితో పనులు చేయించాల్సి ఉంటుంది. అదే మెకానికల్‌ ఇంజినీర్‌ అయితే యంత్రాల పనితీరు. గనులు, వర్క్‌షాపుల్లో మోటార్లకు సంబంధించిన పర్యవేక్షణ చేయాలి.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి సర్క్యూట్‌, ఏసీ, డీసీ కరెంటుకు సంబంధించిన అంశాలపై పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వనున్నారు. దీంతో పాటు సాధారణ ఐక్యూ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదే మెకానికల్‌కు వచ్చే సరికి యంత్రాలకు సంబంధించిన మోటార్లు, వాటి పని విధానానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారు.
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (సివిల్‌)
ఖాళీలు: 10 (స్థానికత ఆధారంగా 6)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌). 55 శాతం మార్కులు
విధులు: నిర్మాణాలకు సంబంధించిన కట్టడాల పర్యవేక్షణ. నీటి సరఫరా. నిర్మాణాల్లో నాణ్యత పరీక్షలు. శానిటరీ పైపులైను, నీటి సరఫరా పైపులైన్‌ నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు. ముఖ్యంగా నిర్మాణాలపై పర్యవేక్షణ.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలపై అనుబంధ ప్రశ్నలు. భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన నిర్మాణాల ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ప్రశ్నలు ఇవ్వనున్నారు.
* సంక్షేమాధికారులు (వెల్ఫేర్‌ ఆఫీసర్‌) 
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (పర్సనల్‌)
ఖాళీలు: 40 (స్థానికత ఆధారంగా 24)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌. కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: పీజీ, మేనేజ్‌మెంటు పీజీ, పీజీ డిప్లొమా, హెచ్‌.ఆర్‌., ఇండస్ట్రీయల్‌ రిలేషన్స్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంటు, ఎంఎస్‌డబ్ల్యూ., ఎంహెచ్‌ఆర్‌డి, ఎంబీఏ (హెచ్‌ఆర్‌.), 60 శాతం మార్కులు.
విధులు: కార్మికుల సంక్షేమం.. సీఎంపీఎఫ్‌ ప్రయోజనాల అంశంపై సంబంధిత శాఖతో సంప్రదింపులు, సంస్థ విధి విధానాలపై కార్మికులకు అవగాహన కలిగించే పనులు. విధులకు హాజరు కాని కార్మికులకు కౌన్సెలింగ్‌, సెలవులు, సిక్‌, మెడికల్‌ సిక్‌ల వినియోగంలో కార్మికులకు వర్తించే వాటికి సహకరిస్తుంటారు.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: పర్సనల్‌ మేనేజ్‌మెంటు, సోషియాలజీ, కార్మిక చట్టాలు, పారిశ్రామిక సంబంధాలు, ఆర్థిమెటిక్‌, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిషు, జనరల్‌ నాలెడ్జ్‌, ఐక్యూలలో ప్రశ్నలు అడుగుతారు.
* గణాంకాధికారి (అకౌంట్స్‌ ఆఫీసర్‌)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)
ఖాళీలు: 18 (స్థానికత ఆధారంగా 11)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌. కనీస మూలవేతనం రూ.20,600 నుంచి రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ
విధులు: బిల్లుల తయారీ. కార్మికుల వేతనాలు చెల్లింపు జాబితాలు. సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలు. వసూలు చసే బిల్లులు. చెల్లింపులు.
పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: అకౌంట్స్‌, ఆడిట్‌కు సంబంధించిన అనుబంధ ప్రశ్నలు. లాభ నష్టాలు, రెవెన్యూ. పారిశ్రామిక చట్టాలు. మార్కెటింగ్‌, వడ్డీలు, పన్నులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
* మైనింగ్‌ సూపర్‌వైజర్‌ 
హోదా: జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైనీ
ఖాళీలు: 811 (స్థానికత ఆధారంగా 648)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగి, కనీస మూలవేతనం రూ.19,035
విద్యార్హత: మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా
విధులు: గనిలో పని చేసే సిబ్బందికి సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహించాలి. డీజీఎంఎస్‌, గనుల చట్టాన్ని అనుసరించి కింది స్థాయి సిబ్బందితో పనులు చేయించాలి. కోల్‌ మైన్స్‌ రెగ్యులేషన్‌ చట్టం-43 ప్రకారం తన బాధ్యతలు గుర్తించి విధులు నిర్వహిస్తారు.
పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ప్రథమ చికిత్స. ఫైర్‌గ్యాస్‌. వాటర్‌. వెంటిలేషన్‌. గనుల చట్టాలు. గనుల సర్వేకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (మెకానికల్‌) 
హోదా: అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ
ఖాళీలు: 72 (స్థానికత ఆధారంగా 58)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగి, కనీస మూల వేతనం రూ.19,035
విద్యార్హతలు: మెకానికల్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌
విధులు: గనుల్లో యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కింది స్థాయి సాంకేతిక సిబ్బందితో యంత్రాలు నిలిచిపోకుండా పనులు చేయించాలి. సాంకేతిక సిబ్బందికి సూపర్‌వైజర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: మెకానికల్‌ విభాగానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు. యంత్రాల పనితీరు. వాటికి విద్యుత్తు సరఫరా ఇచ్చే ఏసీ, డీసీ విధానంపై సాంకేతిక ప్రశ్నలు ఇవ్వనున్నారు.
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌) 
హోదా: అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ
ఖాళీలు: 60 (స్థానికత ఆధారంగా 48)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ, టెక్నికల్‌ స్పెషల్‌ గ్రేడ్‌, కనీస మూలవేతనం రూ.19,035
విద్యార్థలు: ఎలక్ట్రికల్‌ డిప్లొమా, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా
విధులు: కార్మిక వాడల్లో గృహ అవసర విద్యుత్తు సరఫరా పర్యవేక్షణ. గనులకు విద్యుత్తు సరఫరా. యంత్రాలకు విద్యుత్తు సరఫరా అందుతుందా అన్న విషయాల్లో పర్యవేక్షణ.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ఎలక్ట్రికల్‌కు సంబంధించిన అనుబంధ అంశాలు. విద్యుత్తు సరఫరా, ఏసీ, డీసీ, హెచ్‌టీతో పాటు ఇతర విద్యుత్తుకు సంబంధించిన ప్రశ్నలను పరీక్షల్లో అడుగుతారు.
* వయో పరిమితి 30 ఏళ్లు
ప్రస్తుతం ప్రకటించిన ప్రతి ఉద్యోగానికి 30 ఏళ్ల వయో పరిమితిని నిర్ధారించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం మరో 5 ఏళ్లు సడలింపునిచ్చారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులైతే 30 ఏళ్ల వయో పరిమితి ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 35 ఏళ్ల వరకు ఉంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* రాత పరీక్షే ప్రామాణికం
సింగరేణిలో తొలిసారిగా ఒకే ఒక్కసారి రాత పరీక్షతోనే ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. గతంలో రాత పరీక్ష తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహించే విధానానికి స్వస్తి పలికిన సింగరేణి ఈ సారి మాత్రం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. ఇందులో స్థానికత, సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఉద్యోగాల్లో అమలు చేయనుంది.
* మైనింగ్‌ కోర్సుకు తిరుగులేదు - మార్కండేయ, జేఎన్టీయూహెచ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌.
ప్రతి ఏటా మైనింగ్‌ ఇంజినీరింగ్‌, మిషనరీ నుంచి 90 మంది విద్యార్థులు బయటకు వస్తుంటారు. అదే విధంగా డిప్లొమా మైనింగ్‌ నుంచి కూడా 180 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో భారీగా మైనింగ్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమాకు సంబంధించిన ఉద్యోగ ఖాళీల నియమకానికి ప్రకటన విడుదల చేశారు. గతంలో సింగరేణితో పాటు ఇతర ప్రాంతాల్లోని బొగ్గు పరిశ్రమల్లో మైనింగ్‌ విద్యార్థులు పనిచేస్తున్నారు. ఒకప్పుడు సివిల్‌కు డిమాండ్‌ ఉండేది. కానీ ప్రస్తుతం మైనింగ్‌ను మించిన కోర్సు లేదు. సింగరేణిలో వచ్చిన అవకాశాన్ని రెండు, మూడేళ్లుగా బయటకు వచ్చిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే అవకాశం కలిగింది.
* పారదర్శకంగా నియామకాలు - మల్లయ్యపంతులు, జీఎం, సింగరేణి పర్సనల్‌.
ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటిస్తాం. అవకతవకలకు ఎలాంటి ఆస్కారం ఉండడు. అభ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోకండి. ప్రతిభ ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పైరవీకారులను ఆశ్రయించి మోసపోకుండా పరీక్షలపై దృష్టి పెట్టి చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరైన పైరవీల పేరుతో అభ్యర్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తే మాకు సమాచారం ఇవ్వండి. సింగరేణిలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ పోస్టుకు గతంలో ఎన్నడు ఎంబీఏ ఫైనాన్స్‌ విద్యార్హతకు అవకాశం ఇవ్వలేదు.

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment