27 February 2015

ఉద్యోగాల భర్తీ కేంద్రీకరణపై వివిధ శాఖల అభ్యంతరం!

ఉద్యోగాల భర్తీ కేంద్రీకరణపై వివిధ శాఖల అభ్యంతరం! శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ యోచనకు మిగిలిన శాఖల నుంచి సానుకూలత కన్పించటం లేదని సమాచారం. జెన్‌కో, ట్రాన్స్‌కో (విద్యుత్‌), సింగరేణి తదితర శాఖలు తమ ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించటానికి ఇష్టపడటంలేదని తెలిసింది. ప్రస్తుతం గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4లతో పాటు కొన్ని ఇతర రకాల గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. అవి కాకుండా కొన్ని శాఖల్లోని ఖాళీలను ఆయా శాఖల్లోని నియామకాల బోర్డు ద్వారా చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్నిరకాల ఉద్యోగాల భర్తీని కమిషన్‌ ద్వారా జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమైనట్లు సమాచారం. స్థానిక సంస్థలు (ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు... తదితరాలు) ప్రభుత్వ రంగ సంస్థల (సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో... తదితరాలు) ఖాళీలను పీఎస్సీకి అప్పగించాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ కేంద్రీకృత భర్తీ పద్ధతికి శాఖలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సింగరేణి దాదాపు 5వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసేసింది కూడా! విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలను డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నియామకాల్లో అక్రమాలను అరికట్టాలంటే పీఎస్సీ ద్వారానే చేయాలని వాదించేవారు ఆయా విభాగాల్లోనూ ఉన్నారు. అయితే ఏ శాఖల అభిప్రాయం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే కీలకాంశంగా మారింది.

No comments:

Post a Comment