తెలంగాణలో నిరుద్యోగుల వివరాల సేకరణ

తెలంగాణలో నిరుద్యోగుల వివరాల సేకరణ
* త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌ 
* ఉద్యోగాల భర్తీకి ప్రామాణికం
 తెలంగాణలో నిరుద్యోగుల సమగ్ర వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. ఉద్యోగాల భర్తీకి ఈ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిరుద్యోగుల సమాచార నమోదు విధానం ఉంది. కానీ.. 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సరిగా జరగక, నిరుద్యోగులు ఆ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పునరుద్ధరణ (రెన్యువల్‌) చేసుకునేందుకూ వెళ్లడం లేదు. నిరుద్యోగుల వివరాల నమోదుకు ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినా అది జరగలేదు. 2012 వరకు తెలంగాణలో 9,49,888 మంది నిరుద్యోగుల పేర్లు నమోదయ్యాయి. మూడేళ్లుగా వివరాల నమోదు మరీ మందగించింది. ఈ సమాచారాన్ని ఉపాధి కల్పన శాఖ క్రోడీకరించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని యోచిస్తోంది. మార్చి మాసాంతానికి కమలనాథన్‌ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తయ్యే వీలున్నందున.. ఆ తర్వాత నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల వారీగా ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇవిగాక నిరుద్యోగుల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా నియామకాలను ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలని భావిస్తోంది. మెడిసిన్‌, ఇంజినీరింగు, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఈడీ, టీటీసీ, పారామెడికల్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన వారి వివరాలను విభాగాల వారీగా సేకరిస్తుంది. ఏ విభాగంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటే.. వారికి సంబంధించిన ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసే అవకాశముంది. నిరుద్యోగుల జాబితాకు అనుగుణంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన కార్యక్రమాలను సైతం చేపడుతుంది. వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆన్‌లైన్‌ ద్వారా వివరాలను సేకరిస్తుంది. ప్రతీ అభ్యర్థి వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, కుటుంబ సమాచారం, ఆదాయం, ఆర్థిక స్థితిగతులు, అభ్యర్థులకు ఆసక్తి గల ఉద్యోగ, ఉపాధి రంగాల వివరాలను నమోదు చేస్తుంది. సామాజిక వర్గం, వికలాంగులు, మహిళలు వంటి కేటగిరీల వారీగా వాటిని క్రోడీకరిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్‌ యువ కిరణాల పథకం కింద ఆన్‌లైన్‌లో నిరుద్యోగుల వివరాలను సేకరించారు. వాటిని ఉపయోగించలేదు. అలా కాకుండా, ఈసారి వివరాలను పక్కాగా సేకరించి, ఉద్యోగాలను కలిపంచాలని సర్కారు యోచిస్తోంది. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినా... ఉపాధి కల్పనశాఖ ద్వారా నిరుద్యోగుల నమోదు ప్రక్రియ యథాతథంగా సాగుతుంది.
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment