తెలంగాణ మున్సిపాలిటీల్లో 2155 ఖాళీల భర్తీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సుమారు 2155 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 24న మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఇందులో ఉపసంఘం సభ్యులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పి.మహేందర్ రెడ్డి, జోగు రామన్న, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ తో పాటు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. 2155 ఖాళీల్లో కమిషనర్ స్థాయి పోస్టులు 91 ఉన్నట్లు ఉపసంఘం గుర్తించింది.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తాం
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇంజినీరింగ్ డిగ్రీలు కాదు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా పని చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన మండలి (టాస్క్) ద్వారా శిక్షణ సౌకర్యాలు మెరుగుపరచి, పరిశ్రమలకు కావాల్సిన విద్యావిధానంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్), సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీల జాతీయ సంఘం (నాస్కామ్)తో టాస్క్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఉపాధ్యక్షుడు బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాస్కామ్‌తో కలిసి చేస్తున్న ప్రయోగాత్మక ప్రాజెక్టులో సుమారు 15 వేల మంది జేఎన్‌టీయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందుతారని తెలిపారు. ఇందులో విద్యార్థులకు డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఇప్పుడున్న సిలబస్‌తో పాటు వివిధ అకడమిక్ మార్పులను చేపట్టనున్నట్లు చెప్పారు. తాము నాణ్యత లేని విద్యా సంస్థల మీద చర్యలు తీసుకుంటే చాలా మంది విమర్శించినా వెనక్కి తగ్గలేదన్నారు. తాము తీసుకున్న చర్యల ఫలితంగానే ఇంజినీరింగ్ విద్యలో లోపాలు బయటపడ్డాయని చెప్పారు. టీహబ్‌పై చర్చించేందుకు టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించిన ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్ వస్తుందని మంత్రి తెలిపారు.
|
|
No comments:
Post a Comment