జనవరిలో తొలి ఉద్యోగ ప్రకటన

జనవరిలో తొలి ఉద్యోగ ప్రకటన
* ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌
* క్రమం తప్పక నియామకాలు
* 2-3 ఏళ్లలో వెల్లువలా ప్రభుత్వ ఉద్యోగాలు
* ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి
ఉద్యోగాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు శుభవార్త! రాష్ట్రంలో జనవరిలో తొలి ఉద్యోగ ప్రకటన వెలువడబోతోంది. పారదర్శకంగా కొత్త పరీక్షల విధానానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) శ్రీకారం చుట్టబోతోంది. ఏటా ఓ కాలావధి ప్రకారం నియామకాలు చేపట్టాలనుకుంటోంది. డిసెంబరు 18న బాధ్యతలు స్వీకరించిన టీఎస్‌పీఎస్‌సీ తొలి ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కమిషన్‌ పనితీరులో సంస్కరణలను, ఉద్యోగాల భర్తీ తీరును, తమపై బాధ్యతల గురించి వివరించారు.
నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంలో మూడోది పూర్తిగా తెలంగాణ రాష్ట్రం చేతిలో ఉంది. ఈ బాధ్యతను ఎలా నిర్వర్తించబోతున్నారు? నీళ్ళు నిధులకున్నట్లే నియామకాలకూ కొన్ని మెలికలున్నాయి. రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు పూర్తయినా విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగానే ఉంది. ఇవాల్టికీ విభజన పూర్తి కానందున టీఎస్‌పీఎస్‌సీ అధికారులకు గదులు లేని పరిస్థితి! కమిషన్‌లో మేం ఐదుగురం తప్ప సిబ్బంది లేరు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు తక్షణమే కూర్చొని ఉద్యోగుల విభజన పూర్తి చేయాలి. లేకుంటే ఏ పనీ ముందుకు సాగదు.
ఉద్యోగాల కోసం ఆశగా చూస్తున్న యువత ఆకాంక్షల్ని ఎలా తీరుస్తారు?: నిజమే. ఏ విభాగాల్లో ఏయే కేడర్లలో ఎన్ని ఖాళీలున్నాయో తేల్చాలి. ఇందుకోసం కసరత్తు అవసరం. దానికి సమయం పడుతుంది. ఎంతో చైతన్యవంతమైన వ్యక్తులు తెలంగాణలో ఉన్నారు. వారే మనకు బలం. ఆ చైతన్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం బతికింది. తెలంగాణ సమాజానికి ఈ చైతన్యమే పెద్ద సవాలు కూడా. దీన్ని అధిగమించటానికి కమిషన్‌ ముందు కొన్ని మార్గాలున్నాయి. ఒకటి- అడ్డంకులన్నింటినీ దాటుతూ ఉద్యోగ ప్రకటనలు జారీచేయటం.. కేవలం వాటి ద్వారానే యువత సంతృప్తి పడుతుందనుకోవటం భ్రమ. వారిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామనే పూర్తి విశ్వాసం కల్పించాలి. ఇందుకోసం కమిషన్‌ పనితీరులో సంస్కరణలు చేయాలి. కొత్త విధానాలు తేవాలి. యూపీఎస్‌సీ ఎలా పనిచేస్తోందో మిగతా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లలోని మంచి లక్షణాలేంటో అధ్యయనం చేస్తాం. కొత్త పంథాలో విశ్వసనీయ సంస్థగా కమిషన్‌ని నిలుపుతాం. ఇందుకోసం ఆధునిక సాంకేతిక సాధన సంపత్తిని వాడుకుంటాం.
సంస్కరణలంటే...?: నియామకాలకు క్యాలెండర్‌ను రూపొందించాలనే ఆలోచన ఉంది. ప్రకటన నుంచి, ఫలితం దాకా ఎప్పుడెప్పుడేం జరుగుతుందో తేదీల వారీగా ముందే షెడ్యూల్‌ ప్రకటించి దానికి కట్టుబడాలనేది మా ప్రయత్నం. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సిబ్బందిని కేటాయిస్తే ఇది మొదలెడతాం. ఉద్యోగార్థుల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందిస్తాం. 22 ఏళ్లపాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశాను. విద్యార్థుల ఆలోచనలు నాకు తెలుసు. అపోహలకు తావులేకుండా చూస్తాం. ఏ పరీక్షలు ఎప్పుడనేది ప్లాన్‌ చేసి పరీక్షల పద్ధతిలో కూడా మార్పులు చేయాలనుకుంటున్నాం. ఎవరికెన్ని మార్కులొస్తాయో పరీక్ష కాగానే ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నాతోపాటు మా కమిషన్‌ సభ్యుడు విఠల్‌ కూడా విద్యారంగం నుంచే వచ్చారు. మా అనుభవాలతో పాటు నిపుణుల సలహాలు కూడా తీసుకొంటాం.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మీరు అన్ని వర్గాలకూ సుపరిచితులు. మరి ఈ సాన్నిహిత్యం టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ పాత్రపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశముంది? కమిషన్‌ ఛైర్మన్‌గా ఈ పదవి చాలా ఒత్తిడితో కూడుకొన్నదని తెలుసు. దాన్ని తట్టుకొని ఎలా నిలబడాలో తెలుసు. రాష్ట్ర సాధన, ఉద్యమ సమయంలో ఏ సంఘంలోనూ సభ్యుడిని కాదు. ఉద్యమకారుణ్ణి కాను. అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పాత్రికేయుడిగా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నించా. నా పాత్రలను సమర్థంగా పోషించా. ఇప్పుడూ అంతే నిబద్ధతతో తెలంగాణ బంగారు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే నిష్పాక్షికంగా విధులు నిర్వర్తిస్తా. ఎవరి ఒత్తిళ్లకూ లొంగే ప్రశ్నే లేదు.
కమిషన్‌ ఉద్యోగాలంటేనే పైరవీలనే పేరుంది.. ఓ ఉదాత్త లక్ష్యం కోసం నేనీ బాధ్యతలు చేపట్టా. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. యువత నాపై అంతే విశ్వాసం ఉంచాలని కోరుతున్నాను. ఎలాంటి ఆందోళన చెందక పరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యార్థులు, ఉద్యోగ ఆశావహుల్ని కోరుతున్నాను. తెలంగాణ, భావి పాలన పునర్నిర్మాణ బాధ్యతలను ముఖ్యమంత్రి మాపై పెట్టారు. రాజకీయ జోక్యం ఉండబోదని హామీ ఇచ్చారు. ఆయన మాటపై నిలబడతారు. కాబట్టి కమిషన్‌లో ఎలాంటి అవకతవకలు జరగబోవని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఏడాదిలో కమిషన్‌ను సామాజిక బాధ్యతగల సంస్థగా తీర్చిదిద్దుతాం.
ఇంతకూ తొలి ఉద్యోగ ప్రకటన ఎప్పుడు...? ముఖ్యమంత్రికి చెప్పి... జనవరిలో చిన్నదైనా ఓ ఉద్యోగ ప్రకటన విడుదలకు ప్రయత్నిస్తాం. ఇప్పుడు లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయంటే కారణం... వాటిని గత పాలకులు ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవటం వల్లే. తెలంగాణలో ఈ పరిస్థితి ఇకముందు ఉండబోదు. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఉద్యోగుల విభజన పూర్తయితే ఏడాదిలో కొత్త ఖాళీలపై మరింత స్పష్టత వస్తుంది. తెలంగాణలో రానున్న రెండు మూడేళ్లలో చెరువుల నిర్వహణ, జలజాలం, విద్యుత్‌ ప్రాజెక్టులు తదితరాల కారణంగా కొత్తకొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. 
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment