నిజాయతీగా జవాబులు చెప్పాలి !
ఎస్‌బీఐ క్లర్కులు - ఇంటర్వ్యూ గైడెన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూన్, జులై నెలల్లో క్లరికల్ కేడర్ పోస్టులకు రాతపరీక్షలను నిర్వహించింది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి..
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులందరికీ సాధారణంగా ఒక విధమైన ఆందోళన, భయం ఉంటాయి. ముఖ్యంగా ముఖాముఖిలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి ఎలా సిద్ధమవ్వాలి? అనే సందేహం ఉంటుంది. సాధారణంగా ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు అభ్యర్థి వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు అడిగే ప్రశ్నలకు నిజాయతీగా జవాబులు చెప్పాలి. తెలియని వాటికి సమాధానం తెలియదని అంగీకరించాలి. ఇంటర్వ్యూలో తరచుగా అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సన్నద్ధమైతే సగం పని పూర్తయినట్లే.
ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలు
మీ గురించి చెప్పండి.
బ్యాంకింగ్ రంగం ఎందుకు ఎంచుకున్నారు?
ప్రశ్నకు నిజాయతీగా మీరు ఎందుకు బ్యాంకు పరీక్షలు రాస్తున్నారో చెప్పండి. వాళ్లకు నచ్చే జవాబు కాకుండా అసలు విషయం చెప్పే ప్రయత్నం చేయండి.
మీ బలాలు, బలహీనతలను చెప్పండి.
బలహీనతలు పరోక్షంగా మీ సామర్థ్యాన్ని తెలిపేవిగా ఉండాలి. ఎక్కువసేపు పనిచెయ్యడం, త్వరగా నేర్చుకోవడానికి తాపత్రయ పడటం లాంటివి వీటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. బలహీనతల గురించి అడగని పక్షంలో వాటిని చెప్పవద్దు.
ఉద్యోగానికి మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలి?
దీనికి మీకున్న అర్హతలు, బలాలను తెలుపుతూ మీరు మిగిలిన వారికంటే ఎలా ప్రత్యేకమో చెప్పగలగాలి.
5 - 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు?
మీరు సాధించిన విజయాలు ఏమిటి?
ఈరోజు వార్తాపత్రికలోని విశేషాలు ఏమిటి?
వీటితో పాటు అడగటానికి అవకాశం ఉండే అంశాలు:
ఆర్‌బీఐ కార్యకలాపాలు, ఆర్‌బీఐ చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం
ఫిస్కల్, మానిటరీ పాలసీ మధ్య భేదం
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు
దేశ ఆర్థిక వ్యవస్థపై బ్యాంకింగ్ రంగ ప్రభావం మొదలైనవి
ఇంటర్వ్యూ సమయంలో చేయాల్సినవి /చేయకూడనవి:
చేయాల్సినవి
ఫార్మల్ దుస్తులు ధరించాలి. చక్కగా తల దువ్వుకుని, నీట్ షేవింగ్‌తో వెళ్లాలి. సాధ్యమైనంత ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నం చేయాలి.
మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేయాలి.
విద్యార్హతలు, ఉద్యోగానుభవం లాంటి ధ్రువీకరణ పత్రాలను కాల్‌లెటర్‌లో అడిగిన క్రమంలో చక్కగా ఫైల్ చేసుకుని వెళ్లాలి.
ఇంటర్వ్యూ సభ్యులు ఉండే గదిలోకి ప్రవేశించే ముందు వారిని విష్ చేయాలి. వారి అనుమతితోనే కేటాయించిన సీటులో కూర్చోవాలి.
ఇంటర్వ్యూ సమయంలో చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయాలి. ఇది మనలోని ఆందోళన, భయం లాంటి లక్షణాలను సభ్యులు గుర్తించకుండా ఉండేందుకు సహకరిస్తుంది.
ప్రశ్న ఏ సభ్యుడు అడిగినప్పటికీ జవాబును అందరివైపు చూస్తూ చెప్పాలి.
తెలియని విషయాన్ని తెలియదని అంగీకరించడానికి సంకోచించకూడదు. జవాబు సరిగ్గా తెలిసినప్పుడు దాన్ని ఆత్మవిశ్వాసంతో చెప్పాలి.
జవాబులు సూటిగా, క్లుప్తంగా ఉండాలి. అవసరమైతే సోదాహరణంగా వివరించాలి. డొంక తిరుగుడుగా ఉండొద్దు
ఇంటర్వ్యూలో ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉద్యోగ నిర్వహణకు మీరు సరైన అభ్యర్థి అనే అభిప్రాయం కలిగించాలి.
అభ్యర్థులు ఎంతవరకు నిజాయితీగా జవాబులు చెప్పుతున్నారో బోర్డు సభ్యులు గుర్తిస్తారు.
సభ్యులు అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని... అడగడం పూర్తయ్యాకే జవాబు చెప్పాలి. మధ్యలోనే జవాబు మొదలు పెట్టొద్దు.
సన్నద్ధమైన ప్రశ్నలే అడిగినప్పటికీ... సమాధానం చెప్పేటప్పుడు చదువుకుని వెళ్లినట్లు (బట్టీ పట్టి చెబుతున్నట్లు) కాకుండా సహజంగా ఉండాలి.
ఇంటర్వ్యూ ముగిసాక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలపాలి.
చేయకూడనవి
జీన్స్, టీషర్ట్ లాంటివి వేసుకోకూడదు.
సభ్యులు గుర్తించలేరని భావించి అవాస్తవ సమాచారం చెప్పకూడదు.
జవాబులు తెలియకపోతే ఏదో ఒక జవాబు చెప్పే ప్రయత్నం చేయవద్దు.
ఇంటర్వ్యూ సమయంలో పరధ్యానంగా కనిపించకూడదు. అలాగే గట్టిగా మాట్లాడుతూ సభ్యులపై ఆధిక్యత ప్రదర్శించకూడదు. అవసరమైన మేరకు స్వరంలో హెచ్చుతగ్గులను ప్రదర్శించాలి.
0 comments:
Post a Comment