టాపర్లు చెప్పే పాఠాలు 2014 | |
మేటి ర్యాంకర్లలో చాలామంది ఇంగ్లిష్ పేపర్‌పై శ్రద్ధ పెట్టరు. కానీ పదో తరగతి తర్వాత పరిచయం తగ్గిపోయిన తమ మాతృ (ప్రాంతీయ) భాషపై ఎక్కువ దృష్టి పెడతారు. సాధారణంగా వారి వ్యూహం ఇలా ఉంటుంది... ఎ) పాత ప్రశ్నపత్రాలు సేకరించి, ఎక్కువ మార్కులకు ఆస్కారమున్న అంశాలేమిటో విశ్లేషించుకుంటారు. బి) రాజ్యాంగంలో ఉపయోగించిన పదాలు అలవాటయ్యేలా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ప్రవేశిక (ప్రియాంబుల్)లో వాడిన మాటలు. వీటిని తమ వ్యాసం లేదా ప్రెస్సీ రైటింగ్ జవాబుల్లో విరివిగా ఉపయోగించటానికి ప్రయత్నిస్తుంటారు. సి) నిత్యజీవితంలో ఉపయోగించే పలుకుబడులు తమకు బాగా అలవాటయ్యేలా శ్రద్ధ చూపుతారు. డి) 'ప్రెస్సీ'ని సాధన చేస్తారు. జనరల్‌స్టడీస్‌లో కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇ) పాత సంవత్సరాల ప్రశ్నపత్రాలనుంచి ఎక్కువ షార్ట్ ప్రశ్నలు పునరావృతమవుతాయని భావిస్తూ వాటిని అభ్యాసం చేస్తారు. క్వాలిఫైయింగ్ పేపర్లకోసం టాపర్లు మరీ ఎక్కువ సమయం కేటాయించకపోయినా వాటిని ఎన్నడూ నిర్లక్ష్యం మాత్రం చేయరని మర్చిపోకూడదు. కొన్ని సందేహాలకు జవాబులు * ఉత్తీర్ణతకు అవసరమైన మార్కుల సంఖ్య తగ్గిపోయిందా? అవును. గత సంవత్సరాలతో పోలిస్తే కటాఫ్ మార్కుల శాతం తగ్గింది. ఉదాహరణకు ఈ ఏడాది ప్రథమ ర్యాంకర్ గౌరవ్ అగర్వాల్ సాధించిన మార్కులు 975. 2012 టాపర్ హరిత వి. కుమార్ 1193 మార్కులూ, 2009 టాపర్ దివ్యదర్శిని 1334 మార్కులూ సాధించారు. ఈ రకంగా సివిల్స్ టాపర్ కావాలంటే 48 శాతం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది! * మార్కులు ఇలా ఎందుకు తగ్గిపోతున్నాయి? 1) గరిష్ఠ మార్కులను 2750 నుంచి 2025కి తగ్గించారు. 2) గత విధానంలో రెండు ఆప్షనళ్ళుండేవి. పైగా ఆ పద్ధతిలో ఆప్షనల్స్‌లోనే అత్యధిక మార్కులకు అవకాశముండేది. ఇప్పుడు ఒకే ఆప్షనల్ 500 మార్కులకు ఉంది. 3) గత 3-4 ఏళ్ళుగా మూల్యాంకనంలో యూపీఎస్‌సీ కఠినంగా ఉంటూవస్తోంది. ఈ ఏడాది అది మరింత ప్రస్ఫుటంగా కనపడింది. * పరీక్షలో విజయానికీ, పరాజయానికీ దోహదపడే కీలకమైన అంశాలేమిటి? 2013 పరీక్షలో కీలకంగా మారినవి- 1) ఎస్సే పేపర్ 2) ఆప్షనల్ పేపర్ 3) ఇంటర్వ్యూ * వెయ్యి మార్కులకు నాలుగు పేపర్లతో జనరల్ స్టడీస్ ఉంది కదా? ఈ జాబితాలో దాన్ని కలపలేదేమిటి? టాపర్లలో దాదాపు అందరికీ జనరల్‌స్టడీస్‌లో ఒకేరకమైన మార్కులు వచ్చాయి. టాపర్ నుంచి 440 ర్యాంకర్ వరకూ మార్కులను పరిశీలిస్తే... జనరల్ స్టడీస్ మార్కుల్లో ప్రధానంగా తేడా ఏమీ లేదు. నిజానికి తుది ర్యాంకులను జనరల్‌స్టడీస్ ఏమీ ప్రభావితం చేయలేదు. * మరి ప్రభావం చూపినవేవి? జనరల్ ఎస్సేలో, ఇంటర్వ్యూలో స్కోరు చేసిన మార్కులు ర్యాంకుపై ప్రభావం చూపించాయి. దీనికి తోడు ఆప్షనల్ మార్కుల పాత్ర కూడా ఉంది. * అంటే జనరల్ స్టడీస్ (జీఎస్) పేపర్లతో పోలిస్తే ఈ అంశాలపైనే అభ్యర్థులు శ్రద్ధ చూపించాలనే కదా? కాదు. జీఎస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. మెయిన్స్ స్థాయిలో 1750 మార్కుల్లో 1000 మార్కులు జీఎస్‌వేనని మర్చిపోకూడదు. అంటే మొత్తం 57 శాతం! జీఎస్ సరిగా రాయనివారు మెయిన్స్‌లో నెగ్గటం కష్టం! * జనరల్‌స్టడీస్ కంటే మించి ఎస్సే, ఆప్షనల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ధోరణి కొనసాగుతుందా? లేదు. కొత్త పద్ధతిలో మొదటి పరీక్ష కాబట్టి ఇది సంభవించింది. యూపీఎస్‌సీలోని ప్రత్యేక బృందం తగిన సవరణలు చేస్తుంది. ఈ దిశలో మొదటి అడుగు- ఒక వ్యాసాన్ని రాయటానికి బదులు బహుళ సంఖ్యలో వ్యాసాలు రాసే పద్ధతిని ప్రవేశపెట్టటం. ఈ ఏడాది నుంచి అభ్యర్థులు కనీసం రెండు గానీ లేదా మూడు గానీ వ్యాసాలు రాయాల్సివుంటుందని భావిస్తున్నారు. 6 టాపిక్కులు ఇచ్చి వాటిలో రెండు/మూడు అంశాల గురించి వ్యాసాలు రాయమని అడిగే అవకాశముంది. అంశాన్ని భిన్న కోణాల నుంచి చర్చించమని అడగవచ్చు. మార్కులు కూడా ఆ ప్రకారమే విభజించే అవకాశముంది. మరో విషయం- ఏ ఆప్షనల్ కూడా స్కోరింగ్‌గా ముద్ర పడకుండా యూపీఎస్‌సీ చర్యలు తీసుకుంటోందని భావిస్తున్నారు. దీన్నిబట్టి ఆప్షనల్‌లో ఎవరికీ అత్యధిక మార్కులు రావని అర్థం కాదు. మినహాయింపులు ఉండొచ్చు. ఉదాహరణకు... టాపర్ గౌరవ్ అగర్వాల్ తన ఆప్షనల్ అయిన ఆర్థికశాస్త్రంలో 296/500 (59.2 శాతం) స్కోరు సాధించాడు. తన ఐఐటీ, ఐఐఎం నేపథ్యం మూలంగా అతడు ఎంతో శ్రేష్ఠమైన జవాబులు రాసివుండాలి. * జనరల్ ఎస్సేకు అత్యుత్తమ ర్యాంకర్ల ప్రణాళిక ఎలా ఉంటుంది? ఎ) క్రమం తప్పకుండా కొన్ని అంశాలమీద రాస్తుంటారు. బి) వ్యాసం రాయటానికి పూనుకోకముందు దాని నిర్మాణం ఎలా ఉండాలో స్పష్టం చేసుకుంటారు. సి) మరీ వ్యక్తిగతపరంగా ఉండే అంశాన్ని ఎంచుకోకుండా ఉంటారు. 'సైన్స్ అండ్ టెక్నాలజీ దేశ ప్రగతి, భద్రతలకు ఏకైక మార్గం' లాంటి అంశాలను ఎంచుకుని అధిక మార్కులు సాధిస్తుంటారు. డి) నిర్లక్ష్యంతో సన్నద్ధత చివరి దశలో వ్యాసాన్ని పట్టించుకోవటం లాంటి పొరపాట్లు చేయరు. * జవాబులు రాసేటపుడు బుల్లెట్ పాయింట్లు రాస్తారా? లేకపోతే పారాగ్రాఫ్ పద్ధతిలో రాస్తారా? మెయిన్స్‌లో నెగ్గి, ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలామంది చెప్పేదేమిటంటే... అన్ని జవాబులూ బులెట్ పాయింట్లుగానే రాశామని. కానీ మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన 12వ ర్యాంకర్ అనుసరించిన విధానం.. 1) మంచి పుస్తకాలన్నీ పేరాగ్రాఫ్ పద్ధతిలోనే ఉంటాయి. పరిణిత ఆలోచనా విధానం తెలిపేలా పేరాలుండాలి. 2) ఎగ్జామినర్ తక్కువ సమయంలో చదివేలా రాయాలి. ప్రతి పేరాగ్రాఫ్ క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి. 3) కేవలం గణాంకాలను, వాస్తవికాంశాలను ప్రస్తావించినంతమాత్రాన మార్కులు రావు. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు అభిప్రాయ ఆధారితం. కాబట్టి వాస్తవాంశాలతో సమర్థించేటపుడు జవాబులో వేర్వేరు కోణాలను స్పృశిస్తూ రాయటం సముచితం. * అంతర్జాలం ఎంతవరకూ ఉపయోగకరం? బ్లాగులూ, వెబ్‌సైట్లను అనుసరించటం అవసరమేనా? అంతర్జాలంలో అపారమైన సమాచారం ఉంది. దాన్ని సమతూకంగా ఉపయోగించుకోవాలి. ఎలక్ట్రానిక్- కాగితపు మెటీరియల్ రెంటికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వార్తాపత్రికల సంపాదకీయాలు చాలా ముఖ్యం. కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా ప్రయోజనకరమే. అయితే పూర్తిగా ఎలక్ట్రానిక్ మెటీరియల్ మీద ఆధారపడటం మాత్రం శ్రేయస్కరం కాదు. టాపర్ల అనుభవాల నుంచి తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. పరీక్ష ఏమి ఆశిస్తుందో అవగాహన ఉండాల్సిందే. అయితే ప్రశ్నపత్రాలు ఊహించనిరీతిలో ఉండాలని అలఘ్ కమిటీ స్పష్టంగా నిర్దేశించిందని గుర్తుంచుకోవాలి. అందుకని మెయిన్స్ కోసం రోడ్‌మ్యాప్ తయారుచేసేటపుడు గత ఏడాది ప్రశ్నపత్రం, అనుభవాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఏ తీరులో మార్పు ఎదురైనప్పటికీ తొట్రునాటు పడకుండా ఎదుర్కొనేలా సంసిద్ధత ప్రదర్శించాలి. |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment