టీఎస్‌పీఎస్సీకి యూపీఎస్సీ తరహా మార్గదర్శకాలు | |
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫలితాల వివరాలు * న్యాయస్థాన పరిధి నుంచి మినహాయింపునకు చట్టం * ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ తరహా మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక క్యాలెండర్, సమగ్ర పాఠ్యాంశాలతో పాటు న్యాయస్థాన పరిధి నుంచి మినహాయించేందుకు వీలుగా చట్ట సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు ఆగస్టు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర మార్గదర్శకాలు, నియమ నిబంధనలపై త్వరలోనే మరో ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సాధారణ పరిపాలన శాఖ వీటిని రూపొందించింది. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం ఆరంభంలోనే వార్షిక ప్రణాళికను ప్రకటిస్తారు. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపడతారు. ప్రతి శాఖా విధిగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు టీఎస్‌పీఎస్సీకి అందించాలి. జాప్యం చేసినా, నిర్లక్ష్యం చూపినా సంబంధిత శాఖ ఉన్నతాధికారిని సంజాయిషీ కోరతారు. కమిషన్ పరీక్షల సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తారు. కేవలం టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలకే కాకుండా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కు పోటీ పడే విధంగా సిలబస్‌ను తయారు చేస్తారు. యూపీఎస్సీ నియామకాలను న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలుండదు. ఇదే తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నియామకాలను న్యాయస్థానం పరిధి నుంచి మినహాయించేలా చట్టాన్ని తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల సౌకర్యంతో పాటు ప్రశ్నపత్రాలు, మూల్యాంకన ఫలితాలను, ఎంపికలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఇవిగాక మరికొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీపై ఆర్డినెన్స్!తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ కోసం ఆర్డినెన్స్ జారీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా సత్వరమే ఉద్యోగ నియామకాల కోసం వీలుగా ఆర్డినెన్స్ ద్వారా కమిషన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనుంది. శాసనసభ సమావేశాల్లో దీనికి ఆమోదం తీసుకోనుంది. |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment