| ఏ మెట్టు.. సివిల్స్ పట్టు | |
* సాధారణ కోర్సుకూ విద్యార్థుల పోటాపోటీ * యువతకు వేదికగా నిజాం కళాశాల ఏం చదువుతున్నావు అని అడిగితే ఇంజినీరింగ్, మెడికల్ అంటూ చాలా మంది విద్యార్థులు సగర్వంగా చెబుతుంటారు. ఎవరైనా తాము బీఏ చదువుతున్నామని చెబితే.. నగరంలో ఉంటూ ఇదేం చదువు అని అధిక శాతం మంది లోలోపలైనా నవ్వుకోవడం ఖాయం. బీఏ ఎందుకూ పనికిరాని కోర్సు అని వారి ఉద్దేశం కావొచ్చు. కాని ఇపుడు బీఏ విద్యార్థులను చూసి మీరు పైకి నవ్వినా వారు పట్టించుకోరు. ఎందుకంటే వారి అసలు లక్ష్యం సివిల్ సర్వీసెస్. దేశంలో అది అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం. ఆ శిఖరాన్ని అందుకోవడానికి... అందుకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడానికి నిజాం కళాశాలను వేదికగా ఎంచుకున్నారు. బీఏను మెట్టుగా చేసుకుని ప్రథమ సంవత్సరం నుంచి సివిల్స్‌పై గురిపెడుతున్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో చేరిన విద్యార్థులను నీ లక్ష్యం ఏమిటని ప్రత్యేకంగా అడగాల్సిన పనిలేదు. అక్కడ చేరారంటేనే సివిల్స్ లక్ష్యమని అర్ధం. అదే పరిస్థితి నిజాం కళాశాలలో డిగ్రీ విద్యార్థులకూ కొంతైనా వర్తించేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. నిజాం కళాశాలలో డిగ్రీలోని ఏ గ్రూపులోనైనా సీటు దక్కాలంటే ఇంటర్మీడియట్‌లో కనీసం 80 శాతం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది ఒకప్పటి మాట కావొచ్చని అపోహ పడొద్దు. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఇంజినీరింగ్ సీట్లు పెరుగుతున్న కొద్దీ...ఆ కోర్సునకు డిమాండ్ తగ్గుతున్న కొద్దీ విద్యార్థులు నిజాం కళాశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నిజాం కళాశాలలో డిగ్రీ కోర్సులకు 2 వేల దరఖాస్తులు పెరిగాయి. గత సంవత్సరం మొత్తం 5,628 దరఖాస్తులు అందగా ఈసారి 7,540కు చేరింది. కళాశాలలో ఉన్న సీట్లు 660 మాత్రమే. బీఎస్‌సీలో 150 సీట్లకు 2909 దరఖాస్తులు రాగా బీకాంలో 90 సీట్లకు 2,210 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే బీకాం కోర్సునకు అత్యంత డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఆ రెండు కోర్సులకే కాదు..బీఏకూ అదే డిమాండ్. బీఏ ఆంగ్ల మాధ్యమంలో ఏడు కాంబినేషన్ల కోర్సుల్లో 240 సీట్లకు గత ఏడాది 717 మంది పోటీ పడగా ఈసారి ఆసంఖ్య 934కు పెరిగింది. బీఏ తెలుగు మాధ్యమంలో 60 సీట్లుండగా గత సంవత్సరం 288, ఈసారి 391 మంది విద్యార్థులు పోటీపడ్డారని నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య వీరభద్రం చెప్పారు. ఎందుకంత పోటీ మౌలిక సదుపాయాలు, పీహెచ్‌డీ ఉన్న ఆచార్యులు, నగరం నడిబొడ్డున ఉండటం తదితర కారణాల వల్ల నిజాం కళాశాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుంది. దేశంలో అత్యధిక విదేశీ విద్యార్థులున్న ఘనత ఈ కళాశాలకే ఉంది. మొత్తం 45 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అందుకే ఇక్కడ బీఏ చదువుకు అంత పోటీ ఉంటుంది. ప్రతి తరగతిలో 30 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉంటారు. వారితో స్నేహం చేస్తే ఆంగ్ల భాషపై కొంత వరకు పట్టు పెరుగుతుందన్న ఉద్దేశంతో తెలుగు విద్యార్థులు నిజాం కళాశాలను ఎంచుకుంటారు.మంచి గ్రంథాలయం, హాస్టల్ వసతి ఉండటంతో సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకుంటున్న వారు ఈ కళాశాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆంగ్ల బోధన కేంద్రమూ ఉందని సమన్వయకర్త అంబటి శ్రీనివాస్ తెలిపారు. తమ లాంటి లక్ష్యం ఉన్న వారితో స్నేహం ఉపయోగపడుతుందని విద్యార్థులు విశ్వసిస్తున్నారు. బీఏలో చదివిన మూడు సబ్జెక్టులు సివిల్స్ సిలబస్‌లో చాలావరకు ఉపయోగపడతాయని కొందరు ఈ కోర్సుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక పుస్తకాలు...వెబ్‌సైట్లపై దృష్టి పదో తరగతి, ఇంటర్‌లో సివిల్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటున్న విద్యార్థులు డిగ్రీలో చేరిన నాటి నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒకవైపు మార్కుల కోసం...ఉత్తీర్ణులయ్యేందుకు డిగ్రీ సబ్జెక్టులను చదువుకుంటూనే వాటిని సివిల్ సర్వీసెస్ లక్ష్యంతో విశ్లేషణాత్మక కోణంలో చూస్తున్నారు. పత్రికల్లో వచ్చే విజేతల ముఖాముఖీలను చదవడం, కురుక్షేత్ర, సీఎస్‌ఆర్ తదితర మేగజైన్ల ద్వారా సివిల్స్ గురించి లోతుగా తెలుసుకుంటున్నారు. | |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment